![]() |
![]() |
(నటి రాజసులోచన జయంతి సందర్భంగా..)
అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టి పడేసిన హీరోయిన్లు పాతతరంలో ఎంతో మంది ఉన్నారు. వారిలో రాజసులోచనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆమె నటనలోనే కాదు, సంగీతం, నృత్యం, కార్ డ్రైవింగ్, బోట్ రైడింగ్.. ఇలా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో అగ్రహీరోల సరసన నటించి హీరోయిన్‌గా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాజసులోచన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం ఎలా సాగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం.
1935 ఆగస్ట్ 15న విజయవాడలో భక్తవత్సలం నాయుడు, దేవిక దంపతులకు జన్మించారు రాజసులోచన. ఆమె అసలు పేరు రాజీవలోచన. స్కూల్‌లో చేర్పించే సమయంలో పొరపాటున రాజసులోచన అని రిజిస్టర్‌లో రాశారు. ఇక ఆమెకు ఆ పేరే ఖరారైంది. భక్తవత్సలంనాయుడు మద్రాస్‌లో రైల్వేలో ఉద్యోగం చేసేవారు. రాజసులోచనకు నృత్యం మీద, సంగీతం మీద ఆసక్తి కలగడానికి కారణం.. ఆమె మేనమామ. ఆయన కళాభిమాని కావడంతో ఒక సంగీత మండలిని స్థాపించి సంగీత కచ్చేరీలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయించేవారు. ఆ కార్యక్రమాలు చూసి ఇంటికి వచ్చిన తర్వాత వారిలాగే పాటలు పాడేవారు, డాన్స్ చేసేవారు రాజసులోచన. డాన్స్‌పై ఆమెకు ఉన్న ఇష్టాన్ని గమనించి ఏడేళ్ళ వయసులో నృత్యం నేర్పించారు భక్తవత్సలం. 13వ ఏట రాజసులోచన తొలిసారి నృత్య ప్రదర్శన ఇచ్చారు.
అప్పుడప్పుడు ప్రదర్శనలు ఇస్తూ.. ఇంటి దగ్గర తన తోటి ఆడపిల్లలకు డాన్స్ నేర్పేవారు. అలా డాన్స్ నేర్పేందుకు ఒక యువతి ఇంటికి వెళ్లేవారు రాజసులోచన. ఆ సమయంలోనే పరమశివం అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. అతను చెప్పే తియ్యని మాటలకు పరవశించిపోయిన రాజసులోచన అతని ప్రేమలో పడిపోయింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ, కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అయినప్పటికీ కూతురి ఇష్ట ప్రకారమే 1951 సెప్టెంబర్ 11న పరమశివంతో వివాహం జరిపించారు. అదే సంవత్సరం గుణసాగరి అనే చిత్రంలో ఒక నాట్య సన్నివేశంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కన్నతల్లి చిత్రంలోనూ నృత్యతారగానే కనిపించారు. పెళ్ళయిన సంవత్సరానికి ఒక బాబు పుట్టాడు.
నటిగా నిలదొక్కుకోవడానికి కొన్ని సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ చేశారు రాజసులోచన. ఎన్టీఆర్ హీరో ఘంటసాల నిర్మించిన సొంతవూరు చిత్రంలో తొలిసారి హీరోయిన్ నటించారు. ఆ తర్వాత పలు భాషల్లో అమెకు అవకాశాలు రావడంతో నటిగా బిజీ అయిపోయారు. కెరీర్ పరంగా ఆనందంగానే ఉన్నప్పటికీ వైవాహిక జీవితం మాత్రం అస్తవ్యస్తంగా మారింది. భర్త పరమశివం వేధింపులు రోజురోజుకీ పెరిగిపోయాయి. అవి భరించలేక భర్తకు విడాకులు ఇచ్చేశారు. భర్త నుంచి విడిపోవడం, కెరీర్ కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఎంతో వేదనకు గురయ్యారు రాజసులోచన. ఆ సమయంలోనే దర్శకుడు సి.ఎస్.రావు ఆమెకు ఓదార్పుగా నిలిచారు. అలా ఆయనకు దగ్గరయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో నటించారు. పరిశ్రమలో వీరిద్దరి గురించి రకరకాల పుకార్లు మొదలయ్యాయి. దానికి సమాధానంగా రాజసులోచనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు సి.ఎస్.రావు. ఆయనకు ఇది వరకే పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆయన్ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు రాజసులోచన. 1963లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. 1966 జూలై 27న వీరికి కవల పిల్లలు పుట్టారు. ఆరోజుల్లో కవల పిల్లలు పుట్టడం అనేది చాలా అరుదు. అందుకే ఈ వార్త అప్పల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. శోభన్‌బాబు హీరోగా నటించిన దేవుడు చేసిన పెళ్లి చిత్రంలో శారద ద్విపాత్రాభినయం చేశారు. ఆమె చిన్నప్పటి పాత్రలను రాజసులోచన కూతుళ్ళు పోషించారు.
రాజసులోచన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటించారు. పెళ్ళయిన తొలి రోజుల్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న సి.ఎస్.రావు, రాజసులోచన దంపతులు పిల్లలు ఎదిగి వచ్చిన తర్వాత వారిలో సఖ్యత లోపించింది. అభిప్రాయ భేదాలు పెరిగాయి. దీంతో ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఆమె జీవితంలో చేసుకున్న రెండు పెళ్లిళ్లు ఆమెకు కలిసి రాలేదు. రాజసులోచన పెద్ద కుమార్తె గురుమూర్తి దేవి అమెరికాలో స్థిరపడ్డారు. చిన్న కుమార్తె చెన్నయ్‌లో ఉంటున్నారు. కుమారుడు శ్యామ్ కూడా విదేశాల్లోనే ఉన్నారు. ప్రముఖ దర్శకుడు భీమ్‌సింగ్ కుమార్తెను వివాహం చేసుకున్నారు శ్యామ్. 2004 తర్వాత సినిమాలు పూర్తిగా తగ్గించిన రాజసులోచన చాలా కాలం ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. చివరికి 2013 మార్చి 5 తెల్లవారుజామున తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు రాజసులోచన.
![]() |
![]() |